రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళినాయక్
చెరువు కట్టలకు మరమ్మతులతో రైతులకు ఊరట
రావిరాల–రాజుల కొత్తపల్లిలో పనులకు శ్రీకారం
కాకతీయ, నెల్లికుదురు : రాష్ట్రంలోని రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ స్పష్టం చేశారు. మండలంలోని రావిరాల, రాజుల కొత్తపల్లి గ్రామాలకు చెందిన తెగిన చెరువు కట్టల గండ్ల మరమ్మత్తు పనులను ఆయన శనివారం డీసీసీ అధ్యక్షులు మురళి నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లో వేర్వేరుగా నిర్వహించిన సభల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ, రెండు చెరువుల మరమ్మత్తులకు సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సహకారంతో రూ.1 కోటి 98 లక్షల నిధులు మంజూరు చేయించామని తెలిపారు. రాజుల కొత్తపల్లి చెరువులో ఐదు చోట్ల తెగిన కట్ట రిపేరుకు రూ.1.45 కోట్లు, రావిరాల చెరువు కట్టకు రూ.53 లక్షలు వెచ్చించనున్నట్లు వెల్లడించారు.
వర్షాకాలంలోపు సాగునీరు
రూ.50 లక్షల లోపు పనులు వెంటనే మంజూరవుతాయని, అంచనా ఎక్కువ కావడంతో కొంత ఆలస్యమైందన్నారు. చెరువులు తెగిన సమయంలో తన సూచన మేరకు మంత్రి సీతక్క పర్యటించి యుద్ధప్రాతిపదికన సహాయం అందించారన్నారు. ఇప్పటికే నీరు లేక రైతులు నష్టపోయారని, పనులు త్వరగా పూర్తిచేసి వర్షాకాలంలోపు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతలో లోపాలుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్లలో రావిరాలకు మరో 50 ఇళ్ల మంజూరుకు కృషి చేస్తామన్నారు. అభివృద్ధిలో పార్టీలకు తావులేదని, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.


