రైతుల హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
భూపాలపల్లి అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యం
భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
కాకతీయ, భూపాలపల్లి : మాటలు ఎక్కువ.. పనులు శూన్యం అన్నట్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి విమర్శించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు సెగ్గెంపల్లి, గడ్డిగానిపల్లిలో పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన నిర్వహించిన బస్తీబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు రూ.12 వేలన్న మాటకే పరిమితమైందని, అదీ సకాలంలో అందుతుందన్న నమ్మకం రైతులకు లేకుండా పోయిందన్నారు. వర్షాకాలంలో యూరియా కూడా సరిగ్గా అందించలేని ప్రభుత్వం రైతుల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు.
పనులతో నిరూపించిన అభివృద్ధి
కరోనా కాలాన్ని మినహాయిస్తే గత ఐదేళ్లలో భూపాలపల్లిలో గణనీయమైన అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, ప్రణాళికాబద్ధమైన పట్టణ అభివృద్ధి పనులు అందరికీ కనబడుతున్నాయన్నారు. ఇసుక నేలతో నీటి సమస్య ఉన్న భూపాలపల్లికి మిషన్ భగీరథ ద్వారా గోదావరి జలాలు తీసుకువచ్చి ఏడాది పొడవునా నీటి భద్రత కల్పించామని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించామని, అభివృద్ధి–సంక్షేమాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లిన పార్టీ బీఆర్ఎస్‌నేనని స్పష్టం చేశారు. హామీలు అమలు చేయని వారిని ప్రశ్నించాలని, భూపాలపల్లి అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.


