అల్ఫోర్స్‌లో సంక్రాంతి శోభ
310 మందితో ముగ్గుల పోటీలు
కాకతీయ, కరీంనగర్ : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ముగ్గులు ప్రతీకలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థుల మాతృమూర్తుల కోసం నిర్వహించిన ముగ్గుల పోటీలను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముగ్గులు దుష్టశక్తులను దూరం చేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయని, సంక్రాంతి పండుగకు అవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. సాంకేతిక అభివృద్ధి ఎంత పెరిగినా సంప్రదాయ కళల విలువ తగ్గలేదని, ఇతర రాష్ట్రాల్లోనూ ముగ్గుల కళకు విశేష ఆదరణ ఉందని తెలిపారు. విద్యార్థుల్లో సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడమే ఈ పోటీల ఉద్దేశమని వివరించారు. ఈ పోటీలకు 310 మందికి పైగా మహిళలు పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. పోటీల్లో మొదటి స్థానం – ఎస్. భాగ్యలక్ష్మి (రూ.3,000), రెండో స్థానం – పి. శ్రీకన్య (రూ.2,000)
మూడో స్థానం – ఎం. మౌనిక (రూ.1,000)నిలిచారు. పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


