కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు
15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన
అభిషేకం పాలలో పురుగులు కనిపించిన ఘటన
ప్రసాద కౌంటర్ వద్ద విద్యుత్ షాక్ కలకలం
ఆలయ నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతున్న భక్తులు
కాకతీయ, నేషనల్ డెస్క్ : విజయవాడలోని ప్రముఖ కనకదుర్గమ్మ ఆలయంలో 2026 జనవరి నెలలో వరుసగా చోటుచేసుకున్న ఘటనలు భక్తుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలో మూడు కీలక సంఘటనలు జరగడం ఆలయ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జనవరి 10న అమ్మవారికి నిర్వహించే శ్రీచక్ర అర్చన కోసం సిద్ధం చేసిన పాలలో పురుగులు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. పూజ కోసం తాజాగా సేకరించిన గోవు పాలకు బదులుగా టెట్రా ప్యాక్ పాలను ఉపయోగించడంపై అర్చకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో కొంతసేపు అర్చన నిలిచిపోవడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.
ప్రసాద కౌంటర్ వద్ద షాక్
ఇదే సమయంలో ఆలయంలో ప్రసాదం పంపిణీ చేసే కౌంటర్ల వద్ద భక్తులు విద్యుత్ షాక్‌కు గురైనట్లు సమాచారం వెలువడింది. భద్రతా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు భక్తుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు 2025 డిసెంబర్ 27న విద్యుత్ బకాయిల కారణంగా కనకదుర్గమ్మ ఆలయానికి కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంది. అయితే, వరుసగా ఈ మూడు సంఘటనలు జరగడం ఆలయ పరిపాలనలో సమన్వయం లోపించిందని, భక్తుల భద్రత, ఆధ్యాత్మిక విశ్వాసాల పట్ల నిర్లక్ష్యం కనిపిస్తోందని భక్తులు విమర్శిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


