జంక్షన్లు జామ్
విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
నేటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు
వరుస సెలవులు రావడంతో నగరవాసుల పల్లెబాట
కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
హైదరాబాద్-విజయవాడ మధ్య మరో 10 ప్రత్యేక రైళ్లు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: సంక్రాంతి సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో భాగ్యనగర పరిసర రహదారులన్నీ ట్రాఫిక్ జామ్‌తో కిటకిటలాడుతున్నాయి. నేడు రెండో శనివారం, రేపు ఆదివారం కావడంతో.. పండుగకు ముందే ప్రయాణికులు ఊర్లకు వెళ్తుండటమే ఈ రద్దీకి ప్రధాన కారణం. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై(NH-65) వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా ఓవైపు ఔటర్ రింగ్ రోడ్ వద్ద వాహనాలు బారులు తీరగా.. మరోవైపు పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఉదయం నుంచీ వెహికిల్స్ క్యూ కట్టాయి. పెద్ద కాపర్తి నుంచి వెలిమినేడు వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఒక్కరోజే సుమారు 65 వేల వెహికిల్స్
సాధారణంగా.. పంతంగి టోల్‌ప్లాజా మీదుగా రోజుకు సుమారు 35వేల నుంచి 40వేల వరకూ వాహన రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే.. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో శనివారం ఒక్కరోజే సుమారు 65 వేల వెహికిల్స్ ఆ మార్గంలో పరుగులు పెట్టాయి. ఇక.. నేడు ఈ రద్ధీ మరింత పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో వాహనాల రద్దీని నియంత్రించేందుకు టోల్‌ప్లాజా సిబ్బంది సహా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇంత పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ అవ్వడానికి ప్రధాన కారణాలు రోడ్డు ఇరుకుగా ఉండటం, సంక్రాంతి సందర్భంగా వాహనాల రద్దీ భారీగా పెరగడం. అదనంగా.. పెద్ద కాపర్తి దగ్గర జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులూ ట్రాఫిక్‌ను మరింత తీవ్రతరం చేశాయి. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి రోడ్లు విస్తరించినప్పటికీ, పండుగ సీజన్ రద్దీ ముందు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు.
ప్రత్యేక రైళ్లు సిద్దం
సంక్రాంతి రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపనుంది. హైదరాబాద్-విజయవాడ మధ్య మరో 10 సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే కొంచెంసేపటి క్రితం ప్రకటించింది. ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఛైర్ కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. రిజర్వేషన్ చేసుకోని వారి కోసం రైలులో సగానికి పైగా జనరల్ బోగీల ఏర్పాటు చేయడం విశేషం. పండగకు ముందు, తర్వాతి రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయి. సంక్రాంతి పండుగ వేళ ఇప్పటికే నడుస్తున్న 150కిపైగా అదనపు ట్రైన్స్‌కు ఇవి అదనం. అయితే, ఇవాళ ప్రకటించిన ప్రత్యేక రైళ్లు.. కేవలం విజయవాడ వరకు మాత్రమే నడుపుతున్నారు.
దక్షిణ మధ్య రైల్వే శాఖ జాగ్రత్తలు
ఇప్పటికే నడుస్తున్న సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ మాత్రం నర్సాపురం, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, మచిలీపట్నం, నాందేడ్ వరకూ నడుస్తున్నాయి. ప్రత్యేక రైళ్ల నిర్వహణ విషయంలోనూ దక్షిణ మధ్య రైల్వే శాఖ జాగ్రత్తలు తీసుకుంది. చాలా ట్రైన్స్‌ను చర్లపల్లి నుంచి బయల్దేరేలా షెడ్యూల్ చేసింది. దీంతో పునర్నిర్మాణంలో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై భారం పడకుండా జాగ్రత్త పడింది. ఒక్క చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచే కాకుండా కొన్ని రైళ్లు బేగంపేట్, హైటెక్ సిటీ, లింగంపల్లి నుంచీ ఎక్కేలా ప్లాన్ చేసింది. ఇదిలా ఉంటే, సంక్రాంతి పండుగను ఆనందంగా తమ సొంత ఊర్లలో జరుపుకునేందుకు నగరవాసులు భారీ సంఖ్యలో పల్లెలకు క్యూకడుతున్నారు. దీంతో టోల్ ప్లాజాలు, విజయవాడ వైపు వెళ్లే రోడ్లు ట్రాఫిక్ తో కిటకిటలాడుతున్నాయి.


