రైతు ఐడీ తప్పనిసరి!
2026 నుంచి పీఎం కిసాన్ లబ్ధికి షరతు
అగ్రిస్టాక్‌తో డిజిటల్ రైతు రిజిస్ట్రీ
ఇప్పటికే 6,567 మంది నమోదు : ఏఓ హరిప్రసాద్ బాబు
కాకతీయ, గీసుగొండ : రైతులకు ప్రభుత్వ పథకాల లబ్ధి పారదర్శకంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అగ్రిస్టాక్ డిజిటల్ నెట్‌వర్క్‌ను అమలు చేస్తోందని మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ బాబు తెలిపారు. ఈ క్రమంలో ప్రతి రైతుకు ఆధార్ తరహాలో ప్రత్యేక రైతు గుర్తింపు సంఖ్య (యూనిక్ ఫార్మర్ ఐడీ) కేటాయించే ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేపడుతున్నట్లు చెప్పారు. 2026 నుంచి పీఎం కిసాన్ సహా కేంద్ర పథకాల లబ్ధికి ఈ రైతు ఐడీ తప్పనిసరి కానుందని స్పష్టం చేశారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేస్తే పథకాలకు మళ్లీ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. మండలంలో ఇప్పటివరకు 6,567 మంది రైతులు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. ఇంకా నమోదు కాని రైతులు ఆధార్, పట్టాదారు పాస్‌బుక్, లింక్ మొబైల్‌తో సమీప మీసేవ లేదా క్లస్టర్ ఏఈవోను సంప్రదించాలని ఆయన కోరారు.


