కథనం కలకలం !
ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ?
అత్యంత వివాదాస్పదంగా మారిన ఓ న్యూస్ ఛానన్ కథనం
ఆయుధంగా వాడుకున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా
ఆ అధికారి ఎవరో తెలిసిపోయేలా ఘోరమైన ప్రచారం
తీవ్రంగా స్పందించిన ఐఏఎస్ అధికారుల అసోసియేషన్
మహిళా అధికారిపై తప్పుడు కథనం సరికాదంటూ ఫైర్
తక్షణమే అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి క్లిప్పింగ్స్ తొలగించాలని డిమాండ్
సదరు మీడియాపై న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరిక
ఇప్పటికే ఇదే అంశంపై ఘాటుగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి..
మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దంటూ పీసీసీ ఛీఫ్ అభ్యర్థన
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన మీడియా కథనం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: మహిళా ఐఏఎస్ అధికారిపై వస్తున్న తప్పుడు కథనాలను తెలంగాణ ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మీడియా సంస్థలపై ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా ఐఏఎస్‌పై ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాన్ని తక్షణమే అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించాలని హెచ్చరించింది. లేనిపక్షంలో సదరు మీడియా హౌజ్‌పై న్యాయపరంగా ముందుకు వెళ్తామని వార్నింగ్ ఇచ్చింది. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. రాజకీయ కుట్రల్లో భాగమై మహిళా ఐఏఎస్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన ఎన్టీవీపై సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈమేరకు ఎన్టీవీ యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఘాటైన లేఖను ఐఏఎస్ అధికారుల సంఘం విడుదల చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఇప్పటికే ఇదే అంశంపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘మీ వ్యూస్, రేటింగ్స్ కోసం మహిళా అధికారుల మీద అవాస్తవాలు రాసి మానసిక హింస పెట్టకండి.. ఇది కూడా సరిపోదు అనుకుంటే నాకింత విషమిచ్చి చంపేయండి’ అంటూ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం సదరు న్యూస్ చానల్ కథనాన్ని తీవ్రంగా ఖండించారు.
ఆ ఇద్దరి మధ్య వివాహేతర బంధం అంటూ కథనం
తెలంగాణకు చెందిన ఒక మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా, సదరు అధికారిణికి, ఒక మంత్రికి మధ్య వివాహేతర బంధం నడుస్తోందంటూ ఎన్టీవీ కథనం ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కథనం క్లిప్పింగులతో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆ అధికారి ఎవరో తెలిసిపోయేలా ఘోరమైన ప్రచారాలు చేయడం కలకలంరేపుతోంది. ఇది మహిళా అధికారి వ్యక్తిత్వంపైనే దాడి కావడంతో ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ కారణాలతో లేదా టీఆర్‌పీ రేటింగ్‌ల కోసం ఒక బాధ్యతాయుతమైన అధికారి పరువుకు భంగం కలిగించడం క్షమించరాని నేరమని సంఘం పేర్కొంది.
ఆరోపణలు పూర్తిగా అవాస్తవం
సదరు మహిళా అధికారికి మంత్రి ప్రత్యేక పోస్టింగ్‌లు ఇప్పించారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఇవి కేవలం పరిపాలనాపరమైన బదిలీలను రాజకీయం చేసే ప్రయత్నమని లేఖలో స్పష్టం చేశారు. మీడియాకు ఉన్న స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ, అధికారుల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం నైతికత లేని జర్నలిజానికి నిదర్శనమని సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి నిరాధారమైన వార్తలు సివిల్ సర్వీస్ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, సమాజంలో వారి పట్ల ఉన్న గౌరవాన్ని తగ్గిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఊహాగానాలతో కూడిన కథనాలు ప్రసారం చేయడం వల్ల కుటుంబ వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని ఐఏఎస్ అధికారుల సంఘం పేర్కొంది. వెంటనే సదరు తప్పుడు కథనాన్ని అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించాలని మ, ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి ఈ విషయంలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఐఏఎస్ సంఘం డిమాండ్ చేసింది. ఒకవేళ స్పందించని పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సమాచార శాఖకు కూడా ఫిర్యాదు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై చర్చ బాధాకరం
తెలంగాణకు చెందిన మహిళా ఐఏఎస్ అధికారిపై ఓ మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారమవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ … వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై చర్చ చేయడం బాధాకరమని అన్నారు. వాస్తవానికి దూరంగా కథనాలు వస్తున్నాయని ఆగ్రహించారు. ఎంతో కష్టపడితే తప్ప మంత్రులు ఈ స్థాయికి చేరుకోరని.. అలాంటి వారిపై మీడియా సంస్థలు నిరాధారమైన వార్తలను ప్రచురించడం మానేయాలని విజ్ఞప్తి చేశారు.


