కొండపాకలో అక్రమ ఇసుక దందా
రోడ్లపై నే ఇసుక కుప్పలు..తరుచూ రోడ్డు ప్రమాదాలు
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట వీణవంక మండలం కొండపాక గ్రామంలో అక్రమ ఇసుక నిల్వలు బహిరంగంగా కొనసాగుతున్నాయి. అనుమతులు లేకుండానే గ్రామంలోని ప్రధాన రహదారులపై, గ్రామాల మధ్య రాకపోకలు జరిగే మార్గాలపై ఇసుకను కుప్పలు కుప్పలుగా నిల్వ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రధాన రహదారులపైనే ఇసుక నిల్వ చేయడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. రోడ్లపై ఇసుక చిందర వందరగా పడి ఉండటంతో జారుడు పరిస్థితులు ఏర్పడి ప్రమాదాల ముప్పు పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇసుక కుప్పల వల్ల ఎగసిపడుతున్న ధూళి గ్రామమంతా వ్యాపించి ప్రజలకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. పిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు.అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను వెంటనే తొలగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత శాఖల నిర్లక్ష్యం వల్లే అక్రమ ఇసుక దందా కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక నిల్వలను తొలగించి రహదారి భద్రతను పునరుద్ధరించాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గ్రామ ప్రజలు హెచ్చరిస్తున్నారు.


