బీఆర్ఎస్‌లో కుంపట్లు నిజమే
నాపై కూడా అవిశ్వాసం పెట్టాలని శంకర్ నాయక్ చెప్పారు
ఆయన వ్యాఖ్యలతో నామనసుకు గాయమైంది
అసెంబ్లీ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయితే నా సతీమణిని బరిలో దింపుతా
కాంగ్రెస్‌లోకి వెళ్లే ఆలోచనలన్నీ ఊహాగానాలే
పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపుకోసం శ్రమిస్తా
మానుకోట మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి
కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్‌లో ప్రస్తుతం నాలుగు వర్గాలు ఉన్నాయన్న మాట కొంతవరకు నిజమేనని, అయితే పార్టీ పెద్దగా నష్టపోయే పరిస్థితి లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మహబూబాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి తెలిపారు. స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ, సమయం వచ్చినప్పుడు అందరూ కలిసే పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం సమయంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ చేసిన ఒక్క వ్యాఖ్యే తమ మధ్య దూరాన్ని పెంచిందని చెప్పారు. “వైస్ చైర్మన్ ఒక్కడినే ఎందుకు… చైర్మన్ అయిన నన్ను కూడా తీసేద్దాం” అనే వ్యాఖ్య కావాలని అన్నాడో, అనుకోకుండా మాటల ధోరణిలో వచ్చిందో తెలియదని, కానీ ఆ ఒక్క మాటే మనసుకు గాయమైందని తెలిపారు. అంతకుమించి తమ మధ్య పెద్ద తగాదాలు, విభేదాలు జరిగాయన్న ప్రచారంలో నిజం లేదన్నారు.
అభివృద్ధి విషయంలో ఎవరి పాత్ర వారిదే
మహబూబాబాద్ నియోజకవర్గానికి అభివృద్ధి రుచిచూపించింది మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య అయితే, మరింతగా అభివృద్ధి చేసి చూపించింది మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అని రాంమోహన్ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో ఎవరి పాత్ర వారిదేనని స్పష్టం చేశారు. రానున్న కాలంలో మహబూబాబాద్ అసెంబ్లీ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయితే తన సతీమణిని తప్పకుండా ఎన్నికల బరిలో నిలుపుతానని ఆయన వెల్లడించారు. అలాగే ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నానన్నది, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఆలోచన ఉందన్నది పూర్తిగా ఊహాగానాలేనని కొట్టిపారేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికైతే అవకాశం కల్పిస్తుందో, వారి గెలుపుకోసం పూర్తిస్థాయిలో పనిచేస్తానని డాక్టర్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.


