మారుతి కారులో అగ్నిప్రమాదం
ప్రమాదం నుంచి తప్పించుకున్న ప్రయాణికులు
అలుగునూరు వంతెనపై ఘటన
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్–వరంగల్ ప్రధాన రహదారిపై అలుగునూరు వంతెన వద్ద శనివారం ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. మారుతి–800 కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే అప్రమత్తమై బయటకు దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనతో హైవేపై కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.


