యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద
ఎమ్మెల్యే గంగుల కమలాకర్
జయంతి పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే
కాకతీయ, కరీంనగర్ : స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి, ఆదర్శమని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. జనవరి 12న తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల పోస్టర్‌ను ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ యువతే దేశానికి వెన్నెముకని, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదన్నారు. స్వామి వివేకానంద జీవితం, ఆయన సందేశాలు యువతకు దిశానిర్దేశం చేస్తాయని, వాటిని ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడేలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ యువజన సమితి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సత్తి నేనీ శ్రీనివాస్ మాట్లాడుతూ జ్యోతి నగర్‌లోని శివా థియేటర్ ఎదుట ఉన్న స్వామి వివేకానంద కాంస్య విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక సేవల్లో విశిష్ట కృషి చేసిన యువతకు ‘యువసేవ పురస్కార్–2026’ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ యువజన సమితి జిల్లా యువసేవ పురస్కార్ అవార్డు కమిటీ చైర్మన్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్‌తో పాటు సమితి నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.


