సోమనాథ్ ఆలయం భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక
బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు
సోమనాథ్ స్వాభిమాన పర్వ్‌లో ప్రత్యేక పూజలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : విధ్వంసాన్ని, భయాన్ని, కాలాన్ని సైతం జయించిన అపూర్వమైన విశ్వాసానికి సోమనాథ్ ఆలయం సజీవ ప్రతీకగా నిలుస్తోందని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. సోమనాథ్ ఆలయంపై జరిగిన దాడులకు వెయ్యేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, అలాగే 1951లో ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు (అమృతోత్సవం) పూర్తవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ చేపడుతున్న సోమనాథ్ స్వాభిమాన పర్వ్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాశిబుగ్గ శివాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ… ఎన్నో దాడులు జరిగినా భారత సంస్కృతి, సనాతన ధర్మ అస్తిత్వాన్ని ఎవరూ దెబ్బతీయలేకపోయారన్నారు. సోమనాథ్ ఆలయం భారతీయుల స్వాభిమానానికి, ఆత్మగౌరవానికి శాశ్వత చిహ్నమని పేర్కొన్నారు. ధర్మం, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయన్నారు. ఈ స్వాభిమాన పర్వ్ ద్వారా యువతలో జాతీయ భావన మరింత బలపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రత్నం సతీష్ షా, సీనియర్ నాయకుడు సముద్రాల పరమేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.


