కేటీఆర్ క్షమాపణ చెప్పాలి : మదాసి శ్రీధర్
రాహుల్ గాంధీపై వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా
కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం
కాకతీయ, ఆత్మకూరు : రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆత్మకూరు మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ నాయకులు శనివారం కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జాతీయ రహదారి–163పై ధర్నా నిర్వహించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మదాసి శ్రీధర్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమని అన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. అలాంటి కుటుంబానికి చెందిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కేటీఆర్‌కు తగదని విమర్శించారు. రాష్ట్రాన్ని పదేళ్ల పాటు దోచుకున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతోమంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకుంటే, ఆ ఉద్యమానికి సోనియాగాంధీ మద్దతు ఇచ్చి రాష్ట్రాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. కేటీఆర్ వెంటనే రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఆత్మకూరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తనుగుల సందీప్, దామెర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్ల సుధాకర్, నాయకులు ఖాసీం, కరీం, షరీఫ్, మంగ రాజు తదితరులు పాల్గొన్నారు.


