మేడారం ఏర్పాట్లపై మంత్రుల హై లెవల్ సమీక్ష
రేపు మేడారానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఐదుగురు మంత్రులతో కూడిన ప్రత్యేక బృందం పర్యటన
అధికార యంత్రాంగంలో హడావుడి
కాకతీయ, ములుగు ప్రతినిధి : సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నేతృత్వంలో మంత్రుల బృందం ఈ నెల ఆదివారం మేడారంలో పర్యటించనుంది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మహాజాతరను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ హై లెవల్ సమీక్ష చేపడుతోంది. ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఎండౌమెంట్, పర్యావరణం, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ, పరిశ్రమలు & వాణిజ్యం, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. పర్యటన వివరాల ప్రకారం ఉదయం 11.45 గంటలకు హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న మంత్రుల బృందం మధ్యాహ్నం 12.45 గంటలకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని హెలిప్యాడ్‌కు చేరుకుంటుంది. అక్కడ కొద్దిసేపు విరామం అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు గోదావరిఖని నుంచి బయలుదేరి, 1.50 గంటలకు ములుగు జిల్లా మేడారంలో దిగనున్నారు.
జాతర ఏర్పాట్లపై సమగ్ర పరిశీలన
మేడారం చేరుకున్న అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్ష నిర్వహించనుంది. భక్తులకు కల్పిస్తున్న వసతులు, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, భద్రత, వైద్య సదుపాయాలు, రవాణా వ్యవస్థ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి, ఇప్పటివరకు చేసిన పనులు, ఇంకా చేపట్టాల్సిన పనులపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. అవసరమైన చోట తక్షణ ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం. మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దివాకర, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, డీఎఫ్‌వోలు, ఇతర శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వసతి, రవాణా, భద్రత, ఎస్కార్ట్, ప్రోటోకాల్ తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాయంత్రం 4.30 గంటలకు మేడారం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న మంత్రుల బృందం సాయంత్రం 5.20 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఈ పర్యటనతో మేడారం మహాజాతర ఏర్పాట్లకు మరింత వేగం వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


