చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్
తొలి మ్యాచ్‌లో రికార్డులే రికార్డులు
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు బాదిన భారత క్రికెటర్‌గా నిలిచింది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగులు చేసిన హర్మన్ ఈ రికార్డు సాధించింది. ఈ క్రమంలోనే యంగ్ బ్యాటర్ షఫాలీ వర్మను హర్మన్ అధిగమించింది. నవీ ముంబయి వేదికగా ముంబయి- ఆర్సీబీ మ్యాచ్‌తో ఈ ఎడిషన్ డబ్ల్యూపీఎల్ షురూ అయ్యింది. ఈ మ్యాచ్‌లో ముంబయి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇందులో హర్మన్ దూకుడుగా ఆడే క్రమంలో 20 పరుగులకు పెవిలియన్ చేరింది. అయితే అంతకంటే ముందే 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హర్మన్ ఈ ఘనత అందుకుంది. దీంతో హర్మన్ (871 పరుగులు) డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక పరుగుల సాధించిన భారత క్రికెటర్‌గా నిలిచింది. ఆమె తర్వాత దిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ షఫాలీ వర్మ (865 పరుగులు) రెండో స్థానంలో కొనసాగుతోంది.


