మామునూర్ ఎయిర్‌పోర్ట్ చుట్టూ కొత్త రోడ్డు
గాడిపల్లి–రంగశాయిపేట మార్గం మూసివేత
36 ఎకరాల భూసేకరణ… రూ.95 కోట్ల అంచనా వ్యయం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : మామునూర్ ఎయిర్‌పోర్ట్ విస్తరణ పనుల నేపథ్యంలో గాడిపల్లి -రంగశాయిపేట రోడ్డును మూసివేయనుండటంతో, ప్రజా రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ రోడ్డును అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. రోడ్డు అండ్ బిల్డింగ్స్ శాఖ రూపొందించిన ప్రతిపాదన మేరకు గాడిపల్లి నుంచి నక్కలపల్లి, దున్నాల కాలనీ, అక్షర టౌన్‌షిప్, బొల్లికుంట చెరువు రోడ్డుమీదుగా ఖమ్మం రోడ్డును కలిపేలా 5.50 కిలోమీటర్ల కొత్త రోడ్డును నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం మొత్తం 36.28 ఎకరాల భూమి సేకరణ అవసరమని అధికారులు పేర్కొన్నారు. భూసేకరణ, రోడ్డు నిర్మాణం, డ్రైనేజీలు, అనుబంధ మౌలిక వసతుల కోసం సుమారు రూ.95 కోట్ల అంచనా వ్యయంతో నివేదికను ఇప్పటికే ఆర్‌అండ్‌బీ శాఖ ప్రధాన కార్యాలయానికి పంపినట్లు తెలిపారు. అనుమతి లభించిన వెంటనే భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు. స్థానిక గ్రామాల ప్రజలకు రవాణా అంతరాయం కలగకుండా ఈ ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త మార్గం పూర్తయితే మామునూర్ ఎయిర్‌పోర్ట్ చుట్టూ ఇంటర్‌లింక్ రోడ్లు, వంతెనల నిర్మాణానికి కూడా దోహదపడనుంది. రైతులు, భూ యజమానులకు న్యాయమైన పరిహారం అందించేందుకు రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.


