క్రీడలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం
క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి
ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి చిత్ర మిశ్ర
ముగిసిన రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడలు
ప్రత్యేక ఆకర్షణగా సంస్కృతి–సంప్రదాయ నృత్యాలు
ఆరు జోన్ల నుంచి పాల్గొన్న 1,800 మంది క్రీడాకారులు
విజేతలకు బహుమతులు అందజేసిన ఐటీడీఏ పీవో
కాకతీయ, ఏటూరునాగారం : గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏ ఏటూరునాగారం ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి గిరిజన బాలబాలికల క్రీడలు శనివారం ఘనంగా ముగిశాయి. సంస్కృతి, సాంప్రదాయ నృత్యాలు, ఆటపాటలు, క్రీడా ప్రదర్శనలతో ముగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ముగింపు కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి చిత్ర మిశ్ర మాట్లాడుతూ… ఆటల్లో గెలుపు–ఓటమి సహజమని, క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. క్రీడలను విజయవంతంగా నిర్వహించిన అధికారులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ క్రీడలను డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ దేశిరాం, ఐటీడీఏ ఏటీడీఓలు, ఏసీఎంఓలు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్పోర్ట్స్ అధికారులు, కన్వీనర్లు సమన్వయంతో నిర్వహించారు. పోటీల్లో ఆరు జోన్ల నుంచి సుమారు 1,800 మంది క్రీడాకారులు పాల్గొనగా, 200 మంది పీఈటీలు, పీడీలు, స్పోర్ట్స్ అధికారులు నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.
వివిధ క్రీడల్లో జోన్ల ప్రతిభ
14 సంవత్సరాల విభాగం కబడ్డీ పోటీల్లో బాలుర విభాగంలో ప్లేన్ ఏరియా మొదటి స్థానం, ఉట్నూర్ రెండో స్థానం, ఏటూరునాగారం మూడో స్థానం సాధించాయి. బాలికల విభాగంలో భద్రాచలం మొదటి స్థానం, ఏటూరునాగారం రెండో స్థానం, ఉట్నూర్ మూడో స్థానం గెలుచుకున్నాయి. 14 సంవత్సరాల విభాగం వాలీబాల్ పోటీల్లో బాలుర విభాగంలో ఉట్నూర్ మొదటి స్థానం, భద్రాచలం రెండో స్థానం, ఏటూరునాగారం మూడో స్థానం సాధించాయి. బాలికల విభాగంలో భద్రాచలం మొదటి స్థానం, ఏటూరునాగారం రెండో స్థానం, ఉట్నూర్ మూడో స్థానం దక్కించుకున్నాయి.
వాలీబాల్, అథ్లెటిక్స్‌లో ఉత్సాహం
17 సంవత్సరాల విభాగం వాలీబాల్ పోటీల్లో బాలుర విభాగంలో భద్రాచలం మొదటి స్థానం, ఏటూరునాగారం రెండో స్థానం, ప్లేన్ ఏరియా మూడో స్థానం సాధించాయి. బాలికల విభాగంలో ఉట్నూర్ మొదటి స్థానం, భద్రాచలం రెండో స్థానం, ఏటూరునాగారం మూడో స్థానం గెలుచుకున్నాయి.
అలాగే అథ్లెటిక్స్, ఆర్చరీ, ఖోఖో తదితర క్రీడల్లో వివిధ జోన్ల క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. విజేతలకు డిప్యూటీ డైరెక్టర్, ఏటీడీఓలు, ఏసీఎంఓలు, ఏటూరునాగారం సర్పంచ్, ప్రధానోపాధ్యాయులు బహుమతులు అందజేశారు. క్రీడలతో విద్యార్థుల్లో ఆరోగ్యం, క్రమశిక్షణ, సామాజిక చైతన్యం పెరుగుతాయని అతిథులు సూచించారు.


