అధికార పార్టీలో టికెట్లకు నేతల ఆరాటం
ఒక్కో వార్డులో ఐదుగురికి పైగా ఆశావహులు
కోర్ కమిటీ వద్దకు దరఖాస్తుల వెల్లువ
స్వతంత్రంగా పోటీపై చర్చలు
రామకృష్ణాపూర్ మున్సిపల్‌లో వేడెక్కిన రాజకీయం
కాకతీయ, రామకృష్ణాపూర్ : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్‌లో టికెట్ల కోసం నేతల ఆరాటం మొదలైంది. 22 వార్డుల పరిధిలో అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఒక్కో వార్డులో ఐదుగురికి పైగా ఆశావహులు ముందుకు రావడంతో పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పట్టణ కోర్ కమిటీకి టికెట్ల కోసం నేతలు వరుసగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పార్టీ కార్యాలయంలో కోర్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రకారం ఆశావహుల వివరాలను కమిటీ సభ్యులు సేకరించారు. పాత నాయకులు, కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల కలయికతో కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది తప్పడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆశావహుల సంఖ్య పెరగడం, టికెట్ల కేటాయింపులో సమన్వయం లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాత నాయకులకే అవకాశాలు ఇవ్వాలంటూ కొందరు నేతలు కోర్ కమిటీపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమావేశంలో నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకున్నట్లు సమాచారం. టికెట్ దక్కకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలన్న ఆలోచనలో కొందరు ఉన్నట్లు చర్చ సాగుతోంది. అదే జరిగితే అధికార పార్టీ కాంగ్రెస్‌కు నష్టం తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రిజర్వేషన్లపై స్వల్ప మార్పుల యోచన
రిజర్వేషన్ల అంశంలో స్వల్ప మార్పులు చేయాలన్న ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టే వ్యూహాలపై కూడా నేతలు చర్చించినట్లు సమాచారం. చివరకు టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్‌కు ఎంతవరకు అనుకూలత వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రెండు దఫాలుగా సర్వేలు పూర్తయ్యాయని చెబుతున్నప్పటికీ, ఇప్పుడు పార్టీ కార్యాలయంలో కీలక సమావేశాలు నిర్వహించడంపై నేతల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు వార్డుల కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడంపై కోర్ కమిటీ సభ్యులపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో స్థానిక నేతలు విఫలమయ్యారని, సోషల్ మీడియాలోనూ పార్టీకి కావాల్సినంత వేగం లేదన్న అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. చివరగా పార్టీ గెలుపు, అభ్యర్థుల విజయం కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.


