మూడు చెక్కలపల్లికి బస్సు సౌకర్యం కల్పించాలి
ఆర్టీసీ డిపో మేనేజర్‌కు సర్పంచ్ వినతి
కాకతీయ, నల్లబెల్లి : మూడు చెక్కలపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 2 వేల జనాభా ఉన్న గ్రామం నుంచి ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు నర్సంపేట, వరంగల్ వంటి పట్టణాలకు ప్రయాణం చేయాల్సి వస్తోందన్నారు. బస్సు సౌకర్యం లేక ప్రైవేట్ వాహనాలపై ఆధారపడుతూ ఆర్థికంగా, సమయపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులు మరింత ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు చెక్కలపల్లి మీదుగా మాన్సింగ్ తండా, చంద్రు తండా, కోడిసెలకుంట తండా, గుర్తూర్ తండాల ప్రజలు కూడా ప్రయాణిస్తున్నారని పేర్కొంటూ ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 1.30 గంటలకు, సాయంత్రం 5 గంటలకు మూడు ట్రిప్పులుగా బస్సు సర్వీసులు నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నెహ్రుజి, లంబాడి హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు దారావత్ బోజ్యా నాయక్, సపావట్ యాకన్న తదితరులు పాల్గొన్నారు.


