కొత్తగూడెం బీఆర్‌ఎస్‌లో కలకలం
కార్పొరేషన్ ఎన్నికల వేళ రాజుకుంటున్న రాజకీయ రగడ
తనను ఇంటికి పిలిపించి కులం పేరుతో దూషించాడు
వనమా రాఘవపై బీఆర్‌ఎస్ సీనియర్ కార్యకర్త చందు నాయక్ ఆరోపణలు
ప్రాణహాని ఉందంటూ ఆందోళన
కాకతీయ ప్రతినిధి, కొత్తగూడెం : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ నేడో–రేపో విడుదల కానున్న నేపథ్యంలో కొత్తగూడెం రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తుండగా, కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీలో పనిచేసిన సస్పెండెడ్ యువనేత వనమా రాఘవ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనను ఇంటికి పిలించి కులం పేరుతో దూషించడాని పాల్వంచకు చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ కార్యకర్త చందు నాయక్ బీఆర్ఎస్ సస్పెడెడ్ నేత వనమా రాఘవను ఉద్దేశించి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పెట్టడం గమనార్హం. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కార్పొరేషన్ ఎన్నికలపై చర్చిద్దామనే నెపంతో తనను యువనేత ఇంటికి పిలిపించారని, అక్కడ తీవ్రంగా అవమానించారని చందు నాయక్ వీడియోలో వాపోయారు.
‘పార్టీ టికెట్ నీకెలా వస్తుంది?’
వీడియోలో చందు నాయక్ మాట్లాడుతూ… గతంలో తాను జలగం వెంకట్రావు కోసం పని చేశానని, ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు రేఖ కాంతారావు కోసం పనిచేస్తున్నానని చెప్పడంపై ఆ యువనేత ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. “నీకెట్లా పార్టీ టికెట్ వస్తుంది?” అంటూ తన కులాన్ని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అంతేకాకుండా, తనను పార్టీ సస్పెండ్ చేసినప్పటికీ కేటీఆర్ తన ఇంట్లో భోజనం చేస్తారని, కార్పొరేషన్ ఎన్నికల్లో తాను ఆమోదించిన పేర్లే ఫైనల్ అవుతాయని యువనేత ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారని చందు నాయక్ వీడియోలో పేర్కొన్నారు. తనను కాదని ఎవరికీ పార్టీ టికెట్ రాదన్నట్లుగా మాట్లాడారని వాపోయారు.
ప్రాణహాని ఉందంటూ ఆందోళన
గతంలోనూ ఆ యువనేత చేసిన అరాచకాలను గుర్తు చేస్తూ, త్వరలో తమ కుల సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తామని చందు నాయక్ తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ, సోషల్ మీడియా వేదికగా సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనను వెలిబుచ్చారు. ఈ ఘటన బీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, కార్పొరేషన్ ఎన్నికల వేళ ఈ వ్యవహారం పార్టీకి ఎంతవరకు నష్టం కలిగిస్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.


