ఐనవోలు జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్వహణ
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
13 నుంచి మల్లికార్జున స్వామి జాతర ప్రారంభం
కాకతీయ, హనుమకొండ : ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాల నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆలయ పరిసరాలను సందర్శించి, వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా దేవాదాయ, పంచాయతీ రాజ్, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య, విద్యుత్ తదితర శాఖల అధికారులు ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లు, పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జాతరకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున దర్శనం సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పారిశుధ్యం, వైద్య, భద్రతపై ప్రత్యేక దృష్టి
పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఆలయానికి వచ్చిన జిల్లా కలెక్టర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శేష వస్త్రాలు అందించి ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తదనంతరం ఆలయ ప్రాంగణంలో అధికారులతో సమావేశమై జాతర ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కమ్మగొని ప్రభాకర్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్, ఆలయ కార్యనిర్వాహణ అధికారి కందుల సుధాకర్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ మధుసూదన్, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, తహసిల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీడీవో నర్మద, ఎస్సై శ్రీనివాస్, ఏఈలు రవికుమార్, సురేష్ కుమార్, ఆలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.


