రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మరణాలు
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలకు చెక్
వరంగల్ రోడ్డు ప్రమాదాల్లో 450 మందికిపైగా మృతులు
సురక్షిత ప్రయాణమే లక్ష్యం కావాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
కాకతీయ, హనుమకొండ : ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రతి వాహనదారుడు క్షేమంగా గమ్యస్థానానికి చేరుకోవడమే మనందరి ప్రధాన లక్ష్యంగా మారాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ట్రాఫిక్ నియమాల పాటింపుతోనే రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా నగర ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై, ముఖ్యంగా హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ర్యాలీని ప్రారంభించడంతో పాటు, హెల్మెట్ ధరించి స్వయంగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ హనుమకొండ చౌరస్తా, ములుగు రోడ్, ఎంజీఎం, పోచమ్మమైదానంలోని ఎస్.ఆర్. కళాశాల వరకు కొనసాగింది.
రోడ్డు ప్రమాదాలు జాతీయ సమస్య
అనంతరం విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు తీవ్రమైన సమస్యగా మారాయని, హత్యల కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని స్పష్టం చేశారు. గత ఏడాది వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల కారణంగా 450కు పైగా మంది మృత్యువాత పడ్డారని, హెల్మెట్ ధరించని కారణంగా తొమ్మిది లక్షల మందికి పైగా వాహనదారులకు జరిమానాలు విధించామని తెలిపారు. పోలీసులు, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వాహనదారులు తమ వ్యక్తిగత బాధ్యతగా భావించి నిబంధనలు పాటించినప్పుడే ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు.

మద్యం సేవించి డ్రైవింగ్.. ప్రాణాంతకం
మద్యం సేవించి వాహనం నడపడం వలన వాహనదారులతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతోందని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు అందించవద్దని, కారు నడిపేటప్పుడు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రోడ్డు భద్రతతో పాటు మత్తుపదార్థాలు, సైబర్ నేరాలు కూడా సమాజానికి పెద్ద ముప్పుగా మారుతున్నాయని పేర్కొన్నారు. యువత మత్తుపదార్థాల జోలికి వెళ్లవద్దని, వాటి వినియోగం భవిష్యత్తును అంధకారంగా మారుస్తుందని హెచ్చరించారు. మత్తుపదార్థాల విక్రయానికి సంబంధించిన సమాచారం పోలీసులకు అందించాలని కోరారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తప్పుడు ప్రకటనలు, ఉచితాలు, ఉద్యోగాలు, లక్కీ డ్రాలు, డిజిటల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న మోసాలను నమ్మవద్దని సూచించారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, వరంగల్ ఏఎస్పీ శుభం, అదనపు డీసీపీలైన ప్రభాకర్ రావు, శ్రీనివాస్, సురేష్ కుమార్, ఏసీపీలైన సత్యనారాయణ, ప్రశాంత్ రెడ్డి, సురేంద్ర, నాగయ్య, జాన్ నర్సింహులు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సీతారెడ్డి, వెంకన్న, సుజాతతో పాటు నగర ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, స్థానిక యువత భారీగా పాల్గొన్నారు.


