సమాజ చైతన్యంలో ముందువరుసలొ టీఎస్‌జేయూ
ప్రజా చైతన్య కార్యక్రమాల్లో ప్రత్యేక గుర్తింపు
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ సిటీ : సమాజాన్ని చైతన్యపరచడంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్‌జెయు) పాత్ర అభినందనీయమని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. ప్రభుత్వ, సామాజిక, ప్రజా చైతన్య కార్యక్రమాల నిర్వహణలో టీఎస్‌జెయు ప్రత్యేకతను చాటుతూ ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆమె ప్రశంసించారు. టీఎస్‌జెయు రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగోని ఆదేశాల మేరకు, వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడు కందికొండ మోహన్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ శుక్రవారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించింది. వరంగల్ చౌరస్తా నుంచి పోచమ్మ మైదాన్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్య శారద, ప్రత్యేక ఆహ్వానితులుగా వరంగల్ డీటీఓ శోభన్, ట్రాఫిక్ సీఐ సుజాత, జాతీయ యువజన అవార్డు గ్రహీత సామాజికవేత్త మండల పరశురాములు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతను బాధ్యతగా పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా అనుసరించాలని, రోడ్డు దాటేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు మాత్రమే కాకుండా వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల స్వయంగా ప్రమాదంలో పడటమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని, ఒక క్షణం నిర్లక్ష్యం కుటుంబాలను రోడ్డున పడే పరిస్థితికి తీసుకెళ్తుందని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు భద్రత కార్యక్రమాలను చేపడుతున్నాయని తెలిపారు. డీటీఓ శోభన్ మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. ట్రాఫిక్ సీఐ సుజాత, ఇంతేజార్‌గంజ్ సీఐ సుకూర్, మాట్టేవాడ సీఐ కరుణాకర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో టీఎస్‌జెయు రాష్ట్ర నాయకులు తోకల అనిల్, నాగపురి నాగరాజు, నరేష్, జిల్లా కమిటీ సభ్యులు బత్తుల సత్యం, కందికొండ గంగరాజు, ఈద శ్రీనాథ్, లింగబత్తిని కృష్ణ, అడుప అశోక్ కుమార్, నాగపూరి అవినాష్, కౌడగాని మోహన్, నీరుటి శ్రీహరి, మంతెన సురేష్, రావుల నరేష్, 28వ డివిజన్ అధ్యక్షుడు సంపత్ కుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, మోటివేటర్ బరుపాటి గోపి, ఎన్సిసి విద్యార్థులు, ధ్రువ, పద్మావతి కళాశాలల విద్యార్థులు, కార్ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


