జమ్మికుంటలో 68 మందికి వైద్య పరీక్షలు
వ్యాధుల నివారణపై అవగాహన
కాకతీయ, జమ్మికుంట : జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి, విద్యా శాఖ అధికారుల ఆదేశాల మేరకు జమ్మికుంట మండలంలో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న వంట సిబ్బందికి శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ వరుణ, మండల విద్యాశాఖాధికారి హేమలత ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు), జమ్మికుంటలో ఈ శిబిరం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ వరుణ అసంక్రమిత వ్యాధులు, రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, గర్భాశయ ముఖ క్యాన్సర్, స్థన క్యాన్సర్, కాలానుగుణ వ్యాధులపై అవగాహన కల్పించారు. మొత్తం 68 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు వరుణ, చందన, మహోన్నత పటేల్, ఆరోగ్య విద్యావేత్త మోహన్‌రెడ్డి, ఏఎన్ఎంలు రాధ, మంజుల, ఆశా కార్యకర్తలు, వంట సిబ్బంది పాల్గొన్నారు.


