కాకతీయ, క్రైమ్ డెస్క్: భార్యను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టి..వారం రోజులుగా ఊర్లో లేమని నమ్మించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ఈ మూవీలోని హీరో. అలాంటి ఘటన ఇప్పుడు నిజ జీవితంలో చోటుచేసుకుంది. తన భార్య శవాన్ని శ్మశానంలో పాతిపెట్టి ఆమె మరొకరితో వెళ్లిపోయిందని నమ్మించే ప్రయత్నం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..యూపీలోని ఆమ్రోహాకు చెందిన షబాబ్ అలీ పెయింటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య ఫాతిమాకు మరొకరితో వివాహేతర సంబంధం ఉన్నట్లు నిందితుడికి ఎప్పటి నుంచో అనుమానం ఉంది. ఆ అనుమానంతోనే ఆమెకు నిద్రమాత్రలు ఇచ్చి తన స్నేహితులతో మరో ప్రాంతానికి తీసుకెళ్లాు. అక్కడ ఆమెతో పురుగుల మందు తాగించి చంపాడు. తర్వాత ఆమె డెడ్ బాడీని ఢిల్లీలోని మోహ్రౌలీ శ్మశాన వాటిలో పాతిపెట్టాడు. తర్వాత సొంతవూరుకు వెళ్లిపోయాడు. తన భార్య ప్రియుడితో కలిసి పారిపోయిందంటూ అందర్నీ నమ్మించాడు. ఆమె ఫోన్ నుంచి మెసేజ్ లు పంపించుకున్నాడు.
అయితే ఫాతిమా కనిపించడం లేదని ఆమె ఫ్రెండ్స్ పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. బాధితురాలిని ఆమె భర్త కారులో తీసుకుని వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ లభ్యం అయ్యింది. దీని ఆధారంగా పోలీసులు అతన్ని ప్రశ్నించారు. భర్త నేరం అంగీకరించాడు. అతనితోపాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని అతనికోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.


