ఓటీటీలోకి ‘అఖండ 2 : తాండవం’… బాలయ్య మాస్ దుమ్ము
కాకతీయ, సినిమా : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2 : తాండవం’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్‌బస్టర్ మూవీ ‘అఖండ’కు సీక్వెల్‌గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించడంతో ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ హైప్ నెలకొంది. కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, బాలయ్య పవర్‌ఫుల్ నటన, మాస్ డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ చూపించిన ఆగ్రహభరిత అవతారాలు థియేటర్లలో ఫ్యాన్స్‌కు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం డీసెంట్ రన్ కొనసాగించింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ చిత్రం నేటి నుంచి (జనవరి 9) స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో సంయుక్త, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటించగా, ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. థమన్ సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు.


