ఆస్కార్ రేసులో కాంతార
మరో మూడు భారతీయ సినిమాలకు చోటు
కాకతీయ, సినిమా డెస్క్ : సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే 98వ ఆస్కార్ అవార్డుల సందడి మొదలైంది. భారత్ నుండి ఏకంగా నాలుగు చిత్రాలు చోటు దక్కించుకుని సంచలనం సృష్టించాయి. మొత్తం 201 చిత్రాలతో కూడిన జాబితాలో ‘ఉత్తమ చిత్రం’ కేటగిరీలో పోటీ పడేందుకు అర్హత సాధించాయి. ఇందులో రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కన్నడ బ్లాక్ బస్టర్ ‘కాంతార చాప్టర్ 1’ గ్లోబల్ స్థాయిలో తన పట్టు నిలుపుకోగా, అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘తన్వి ది గ్రేట్’ ఆస్కార్ రేసులో నిలిచి అందరినీ షాక్‌కి గురిచేసింది. ఇక వీటితో పాటు భారతీయ పురాణ నేపథ్యంలో వచ్చిన బహుభాషా యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’, నూతన దర్శకుడు అభిషన్ జీవింత్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ కూడా ఈ అర్హత జాబితాలో చోటు దక్కించుకున్నాయి. రాధికా ఆప్టే నటించిన ‘సిస్టర్ మిడ్‌నైట్’ సైతం ఈ పోటీలో ఉండటం విశేషం. మరోవైపు భారత్ నుంచి అధికారికంగా పంపబడిన నీరజ్ ఘైవాన్ చిత్రం ‘హోమ్‌బౌండ్’ ఇప్పటికే ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీలో టాప్-15 షార్ట్‌లిస్ట్‌లో నిలిచి భారీ ఆశలు రేకెత్తిస్తోంది.


