వసతి గృహాలు పరిశుభ్రంగా ఉంచాలి
విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం
: అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి
కాకతీయ, గీసుగొండ : విద్యార్థుల వసతి గృహాల పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. మండలంలోని కేజీబీవీ వంచనగిరి, మోడల్ స్కూల్ వసతి గృహాలను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహాల ముందు పరిసరాల శుభ్రతతో పాటు వంటగది, స్టోర్ గదుల నిర్వహణను పరిశీలించారు. అలాగే డార్మిటరీలు, తరగతి గదుల్లో ఫ్లోరింగ్, లైట్లు, విద్యుత్ వైర్లు, కిటికీలు, మెష్ కిటికీల స్థితిని పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. బాలికల వసతి గృహాలు కావడంతో టాయిలెట్లు, నీటి సరఫరా, శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ఎలాంటి లోటు ఉండకూడదని, చిన్న లోపాలు కనిపించినా వెంటనే సరిదిద్దాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ వసుంధర, మండల స్పెషల్ ఆఫీసర్ సురేష్, తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఎంఈఓ ఎస్.రవీందర్, సీఆర్‌పీ వెంకన్న తదితర అధికారులు పాల్గొన్నారు.


