బాలికల ఆరోగ్యానికి భరోసా
రుక్మాపూర్‌లో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
శానిటరీ ప్యాడ్ డిస్పోజల్ మెషిన్ డొనేషన్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల కోసం ఉచిత శానిటరీ ప్యాడ్ డిస్పోజల్ మెషిన్‌ను డొనేట్ చేశారు.
నెలసరి సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, సురక్షిత ఆచారాలు, పోషకాహార ప్రాముఖ్యతపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని, ఆడపిల్లలు ధైర్యంగా తమ ఆరోగ్య సమస్యలపై మాట్లాడగలగాలని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, రుక్మాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కర్రీ ప్రేమలత, ఉపసర్పంచ్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, వార్డ్ మెంబర్లు, విద్యార్థినులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ప్రతిమ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.


