రోడ్డు భద్రతలో నిర్లక్ష్యం తగదు!
విద్యార్థులకు అవగాహన సదస్సు
నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలకు చెక్
కాకతీయ, హుజురాబాద్ : రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు స్పష్టం చేశారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హుజురాబాద్ పట్టణంలోని విజ్ఞాన్ హై స్కూల్‌లో శుక్రవారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు నిబంధనలు ఆచరణలో పెట్టినప్పుడే ప్రమాదాలు తగ్గుతాయన్నారు. పాదచారులు జెబ్రా క్రాసింగ్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లను వినియోగించాలని, రోడ్డు దాటేటప్పుడు “ఆగి–చూసి–ఎడమ, కుడి, ఎడమ” సూత్రాన్ని పాటించాలని సూచించారు. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, జెబ్రా క్రాసింగ్‌ల వద్ద పాదచారులకు దారి ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ స్కూల్ కరెస్పాండెంట్ కోటేశ్వర్లు, రవాణా శాఖ సిబ్బంది కత్తుల నాగరాజు, హోంగార్డ్ సురేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


