కాకతీయ కథనాలు ఆకట్టుకుంటున్నాయి
ప్రజలకు–ప్రభుత్వానికి వారధిగా నిలుస్తోంది
ఇదే ఒరవడిని ఇక ముందు కొనసాగించాలి
కాకతీయ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి : కాకతీయ దినపత్రికలో ప్రచురితమవుతున్న కథనాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయని, ప్రజా సమస్యలను నిర్భయంగా వెలికి తీసి ప్రజలకు అందించడం గొప్ప విషయమన్నారు. ప్రారంభించిన కొద్ది సమయంలోనే లక్షలాది మంది పాఠకులను సంపాదించుకోవడం అభినందనీయమన్నారు. ఇదే ఒరవడిని ఇక ముందు కూడా కొనసాగించాలని పత్రికా యజమాన్యాన్ని మంత్రి కోరారు. ములుగు జిల్లా మేడారంలో శుక్రవారం కాకతీయ దినపత్రిక క్యాలెండర్ కలెక్టర్ టిఎస్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో కలిసి మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య కాకతీయ వారధిగా నిలవాలని అన్నారు.

సమాజంలో నెలకొన్న సమస్యలను గుర్తించి, ప్రజల గొంతుకగా నిలవడమే మీడియా ధర్మమని అన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వానికి చేరవేసే విషయంలో కాకతీయ దినపత్రిక కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల సమస్యలు, రైతులు, కార్మికులు, మహిళల సమస్యలను ప్రధానంగా కథనాలుగా తీసుకువస్తూ కాకతీయ దినపత్రిక విశ్వసనీయతను సంపాదించుకుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మీడియా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తేనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కార్యక్రమంలో కాకతీయ దినపత్రిక ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సుమన్‌తో పాటు జిల్లా రిపోర్టర్లు పాల్గొన్నారు.


