పీవీ జిల్లా ఏర్పాటు చారిత్రక అవసరం
పీవీ సేవాసమితి, అలయన్స్ క్లబ్ ప్రతినిధులు
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయడం చారిత్రక అవసరమని పీవీ సేవాసమితి, అలయన్స్ క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌లను హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కిరీటంగా, తొలి తెలుగు భారత ప్రధాని దివంగత పీవీ నరసింహారావు గౌరవార్థం ఆయన పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలన్నది ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షగా తెలిపారు. నూతన జిల్లాల పునర్విభజన చర్చ మొదలైన నాటి నుంచే ఈ డిమాండ్ కొనసాగుతోందన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయని, హుజురాబాద్‌కు జిల్లా ఏర్పాటు కోసం అవసరమైన అన్ని అనుకూలతలు ఉన్నాయని వివరించారు. ప్రజల అభిప్రాయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.


