ఆమెకున్న ధైర్యం ఏ దర్శకుడికీ లేదు
టాక్సిక్ డైరెక్టర్ గీతూపై ఆర్జీవీ ప్రశంసలు
కాకతీయ, సినిమా డెస్క్ : కేజీఎఫ్ స్టార్ యశ్, దర్శకురాలు గీతు మోహన్‌దాస్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమాను ఉగాది కానుకగా 2026 మార్చి 19న విడుదల చేయనున్నారు. యశ్ 40వ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో హీరో క్యారెక్టర్‌ను పరిచయం చేస్తున్న వీడియోను మూవీ మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ గ్లింప్స్‌పై స్పందించారు. డైరెక్టర్ గీతూమోహన్దాస్ను అభినందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రశంసలు కురిపించిన ఆర్జీవీ
తాజాగా రిలీజైన గ్లింప్స్ చాలా బోల్డ్‌గా ఉంది. మునుపెన్నడు లేని విధంగా యశ్ ఇందులో కనిపించారు. దీంతో ఈ గ్లింప్స్‌ను తెరకెక్కించిన విధానం తనను విపరీతంగా ఆకట్టున్నట్లు ఆర్జీవీ తెలిపారు. ముఖ్యంగా డైరెక్టర్ గీతూమోహన్ దాస్‌పై ప్రశంసలు కురిపించారు. ఆమె విజన్, మేకింగ్ స్టైల్‌ను మెచ్చుకుంటూ ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ షేర్ చేశారు. ‘టాక్సిక్ ట్రైలర్ గ్లింప్స్ చూశాక, మహిళా సాధికారతకు గీతూ మోహన్‌దాస్ నిదర్శనమని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కలేదు. ఇలాంటి సీన్స్ చేయడానికి ఈమెకున్న ధైర్యం ఏ పురుష దర్శకుడికి లేదు. అలాంటి ఆ సీన్ ఈమె ఎలా చిత్రీకరించిందో నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను’ అని అర్జీవీ ట్వీట్లో రాసుకొచ్చారు.


