భూ భారతి పేరిట దోపిడీ!
మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి
జనగామలో రూ.78 లక్షల స్కామ్ అంచనా
చలాన్లు ఎడిట్ చేసి ప్రభుత్వానికి గండి
22 కేసులు.. ముగ్గురు అరెస్టు
రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని మోసాలు జరిగి ఉంటాయా అన్నమానాలు
విచారణ చేపడుతున్న పోలీసు, రెవెన్యూ అధికారులు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : జనగామ జిల్లాలో ‘భూ భారతి’ పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల నిర్వాహకులు చేసిన భారీ ఆర్థిక కుంభకోణం సంచలనం రేపుతోంది. భూమి రిజిస్ట్రేషన్లు, ఇతర డాక్యుమెంట్లకు సంబంధించిన ఫీజులు రైతుల నుంచి పూర్తిగా వసూలు చేసి, ప్రభుత్వానికి మాత్రం తక్కువ మొత్తమే జమ చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. తప్పుడు చలాన్లు, ఫేక్ రసీదుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టినట్లు అధికారులు నిర్ధారించారు. ఓ జర్నలిస్టుకు సంబంధించిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సమయంలో చలాన్లలో తేడాలు కనిపించడంతో అనుమానం మొదలైంది. అధికారులు లోతుగా విచారించగా, మొత్తం 10 డాక్యుమెంట్లలో ఇదే తరహా మోసాలు జరిగినట్లు గుర్తించారు. ఈ డాక్యుమెంట్ల ద్వారా మాత్రమే రూ.8,68,884 వసూలు చేసి, ప్రభుత్వానికి రూ.13,307 మాత్రమే చెల్లించి, రూ.8,55,577ను దారి మళ్లించినట్లు లెక్కలు చెబుతున్నాయి.
ప్రత్యేక యాప్‌లతో చలాన్ ఎడిటింగ్
మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల నిర్వాహకులు ప్రత్యేక యాప్‌లను ఉపయోగించి చలాన్లను ఎడిట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీలను రైతుల నుంచి పూర్తిగా తీసుకుని, ఆన్‌లైన్‌లో తక్కువ మొత్తాన్ని చూపిస్తూ మిగిలిన డబ్బును తమ వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నట్లు తేలింది. ప్రాథమిక దర్యాప్తులో ఒక్క జనగామ జిల్లాలోనే సుమారు రూ.78 లక్షల మేర ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 22 చలాన్ ఎడిట్ కేసులు నమోదు కాగా, ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు చెందిన ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు, హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి ఈ కుంభకోణానికి మాస్టర్‌మైండ్‌లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే తరహా మోసాలు రాష్ట్రవ్యాప్తంగా ఇతర జిల్లాల్లోనూ జరిగి ఉండవచ్చన్న అనుమానంతో ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది. భూ భారతి పోర్టల్, స్లాట్ బుకింగ్ వ్యవస్థల్లోని సాంకేతిక లోపాలపై కూడా అధికారులు దృష్టి సారించారు.


