అత్తా కోడళ్లపై తిరుగుబాటు
పాలకుర్తి కాంగ్రెస్‌లో ముదిరిన అసంతృప్తి
నియోజకవర్గంలో కొంతమంది ముఖ్య నేతల వేరు కుంపటి
ఎమ్మెల్యే యశస్విని, ఝాన్సీరెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం
ఏఐసీసీ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌కు నేతల ఫిర్యాదు
ఒంటెద్దు పోకడలతో పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని కంప్లైంట్
కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ
పరిస్థితి చక్కదిద్దకపోతే పాలకుర్తిలో కాంగ్రెస్ ఖతమే అంటూ హెచ్చరిక
నియోజకర్గంలో ఆసక్తికరంగా మారుతున్న పరిణామాలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎన్నాళ్లుగానో నలుగుతున్న అసమ్మతి ఇప్పుడు బహిరంగ తిరుగుబాటుగా మారింది. స్థానిక ఎమ్మెల్యే మ్యామిడాల యశస్విని రెడ్డి, ఆమె అత్త, సీనియర్ నేత ఝాన్సీ రెడ్డి తీరుపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీని ఒంటెద్దు పోకడలతో నడుపుతూ కాంగ్రెస్‌ను భ్రష్టుపట్టిస్తున్నారంటూ సీనియర్ నేతలు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంతర్గత విభేదాలు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా బయటపడ్డాయి. ఎమ్మెల్యే స్వగ్రామమైన చర్లపాలెంలోనే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి విజయం సాధించడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే, ఝాన్సీ రెడ్డి మద్దతు ఇచ్చిన అభ్యర్థిని ఓడించి రెబల్ అభ్యర్థి ధర్మారపు మహేందర్ 82 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే మడిపల్లి గ్రామంలో యశస్విని బలపరిచిన అభ్యర్థిపై రెబల్ అభ్యర్థి రామలింగం 750 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. సోమారం గ్రామంలోనూ రెబల్ అభ్యర్థి లింగమూర్తి 92 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ పరిణామాలు ఎమ్మెల్యే వర్గానికి బిగ్ షాక్‌గా మారాయి.

హైకమాండ్ దాకా చేరిన ఫిర్యాదులు
స్థానిక స్థాయిలో పరిష్కారం లభించకపోవడంతో అసంతృప్త నేతలు నేరుగా హైకమాండ్‌ను ఆశ్రయించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ను కలిసి ఎమ్మెల్యే యశస్విని, ఝాన్సీ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీనియర్ నాయకులను పక్కనపెట్టి ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని, పార్టీని వ్యక్తిగత గూటిగా మార్చేశారని నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అభివృద్ధి పనుల పేరుతో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నాయంటూ అసమ్మతి నేతలు ఆరోపణలు గుప్పించారు.
కాలువల అభివృద్ధి పేరుతో ట్రస్ట్‌ల ద్వారా నిధులు డ్రా చేశారని, ఎంపీ నిధుల నుంచి సుమారు 50 లక్షల రూపాయలు వాడుకున్నారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఇప్పటివరకు పాలకుర్తి నియోజకవర్గానికి కోటి రూపాయలకు పైగా ఎంపీ నిధులు మంజూరైనప్పటికీ, ఆ నిధులు ఎక్కడ ఖర్చయ్యాయో కార్యకర్తలకు చెప్పడం లేదని నేతలు మండిపడుతున్నారు.
ఎంపీ రాక… ఎమ్మెల్యే అహంకారం?
ఎంపీ మిగతా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నప్పటికీ పాలకుర్తికి మాత్రం రావడం లేదని స్థానిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎంపీని ప్రశ్నిస్తే “ఎమ్మెల్యే ఆహ్వానించాలి కదా” అని సమాధానం వస్తోందని, దీనిబట్టి ఎమ్మెల్యే వ్యవహారం ఎలా ఉందో అర్థమవుతోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి ప్రజలు కాంగ్రెస్‌కు 47 వేల ఓట్ల భారీ మెజార్టీ కట్టబెట్టారని నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే, ఆమె అత్త తీరుతో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులకు కొన్ని సర్పంచ్ స్థానాల్లో 2 వేల మెజార్టీ రావడం అంటే.. కాంగ్రెస్ పార్టీ పతనానికి నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పదని నేతలు హెచ్చరిస్తున్నారు. తక్షణమే హైకమాండ్ జోక్యం చేసుకుని ఝాన్సీ రెడ్డి పెత్తనానికి చెక్ పెట్టాలని, లేకపోతే పాలకుర్తిలో కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు.


