అన్నంలో పురుగులు.. ఇనుప తీగలు
కేయూ మెస్‌లో మరోసారి బయటపడ్డ నిర్లక్ష్యం
విద్యార్థినుల ఆరోగ్యంతో చెలగాటం
హాస్టల్ మెస్ నిర్వాహణపై తీవ్ర విమర్శలు
వీసీ చాంబర్‌ను ముట్టడించిన విద్యార్థినులు
కాకతీయ, హనుమకొండ : కాకతీయ విశ్వవిద్యాలయంలోని గర్ల్స్ హాస్టల్ మెస్‌లో తీవ్ర భోజన భద్రతా లోపాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినులకు వడ్డించిన భోజనంలో పురుగులు, ఇనుప తీగలు బయటపడటంతో క్యాంపస్‌లో కలకలం రేగింది. విద్యార్థినుల ఆరోగ్యంతో యాజమాన్యం చెలగాటమాడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నం, కూరలో పొడవాటి పురుగులు, నలుపు రంగు ఇనుప తీగలు స్పష్టంగా కనిపించాయని విద్యార్థినులు తెలిపారు. తినే సమయంలోనే ఈ వస్తువులు గుర్తించడంతో పలువురు భోజనం వదిలేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్‌లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటపడింది.

ఎప్పటి నుంచో నాసిరకం భోజనం
ఇది మొదటిసారి కాదని, గత కొంతకాలంగా గర్ల్స్ హాస్టల్ మెస్‌లో నాణ్యతలేని ఆహారం, పాత కూరగాయలు, సరైన వంట విధానం లేకపోవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు మెస్ సిబ్బందికి, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. వంటశాల, పాత్రలు, నిల్వ గదుల్లో పరిశుభ్రత లోపించిందని, ఆహార భద్రతపై నిరంతర తనిఖీలు జరగడం లేదని పేర్కొన్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణమని అభిప్రాయపడ్డారు. ఇక హాస్టల్ పరిసరాల్లో వీధి కుక్కలు నిర్బంధం లేకుండా తిరగడం, మెస్ ప్రాంతంలోకి కూడా చేరడం ఆందోళన కలిగిస్తోందని విద్యార్థినులు తెలిపారు. ఆహార ప్రాంతాల్లో జంతువుల సంచారం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినులు పెద్ద ఎత్తున వీసీ చాంబర్‌ను ముట్టడించి ధర్నా చేపట్టారు. గర్ల్స్ హాస్టల్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. యాజమాన్యం స్పందించే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.

వారం రోజుల్లో పరిష్కారం హామీ
విద్యార్థినుల నిరసన తీవ్రత పెరగడంతో యూనివర్సిటీ అధికారులు స్పందించారు. వీసీ ఆదేశాల మేరకు విద్యార్థినులతో సమావేశం ఏర్పాటు చేసి, వారం రోజుల్లో గర్ల్స్ హాస్టల్‌కు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మెస్ నిర్వహణపై సమీక్ష, పరిశుభ్రత మెరుగుదల, భోజన నాణ్యత పెంపు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే గతంలో కూడా ఇలాంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదని, ఈసారి కూడా మాటలకే పరిమితం చేసే అవకాశం ఉందని విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు శాశ్వతంగా పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. గర్ల్స్ హాస్టల్‌లో కనీస సదుపాయాలు, నాణ్యమైన భోజనం, భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని స్పష్టం చేస్తున్నారు.


