మద్యం సేవించి డ్రైవ్ చేయొద్దు!
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
తొర్రూరు డీఎస్పీ కృష్ణ కుమార్ హెచ్చరిక
కాకతీయ, మరిపెడ : వాహనదారులు మద్యం సేవించి వాహనాలను నడపరాదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణ కుమార్ స్పష్టం చేశారు. గురువారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మరిపెడ సీఐ సట్ల రాజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వాహనాలపై విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించి, రోడ్డు భద్రతపై కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సూచించారు.
మైనర్లపై కేసులు తప్పవు
వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులను హెచ్చరిస్తూ, మైనర్లు వాహనాలు నడిపితే వారితో పాటు తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. రోడ్డు భద్రతకు సంబంధించిన నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, వాటిని అతిక్రమిస్తే కఠిన శిక్షలు విధిస్తామని డీఎస్పీ కృష్ణ కుమార్ తెలిపారు. ఈ తనిఖీల్లో మరిపెడ ఎస్సైలు ఈ. వీరభద్రారావు, టి. కోటేశ్వరరావుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


