పేదల ఓటుపై మోదీ కుట్ర
రాజ్యాంగంపై కాషాయం పార్టీ దాడి
రాజ్యాంగ మార్పుకు బీజేపీ కుట్రలు చేస్తోంది
ఓటు ప్రక్షాళన పేరుతో హక్కుల తొలగింపు
బీజేపీ వ్యతిరేక పోరాటాలకు సిద్ధమవ్వాలి
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే యత్నం
ములుగు సభకు సోనియా, రాహుల్, ప్రియాంక
గాంధీ భవన్ లో జరిగిన పార్టీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : దేశంలో పేదల హక్కులను కాలరాసేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.140 కోట్ల జనాభా ఉన్న దేశంలో 80 శాతం మంది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సభ్యులేనని గుర్తు చేశారు. చట్టసభల్లో బలం ఉందని చెప్పుకుని బీజేపీ ప్రభుత్వం పేదలను ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. వెట్టి చాకిరిని నిర్మూలించి, దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చి, ఓటు హక్కు కల్పించింది మహాత్మా గాంధీ, డా. అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఆ రాజ్యాంగాన్నే మార్చేందుకు బీజేపీ గత ఎన్నికల సమయంలో కుట్ర చేసిందని ఆరోపించారు.
రాజ్యాంగంపై బీజేపీ దాడి
గత ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం అంటూ బీజేపీ బహిరంగంగా ప్రకటించిందని సీఎం గుర్తు చేశారు. ఆ ప్రమాదాన్ని గమనించిన రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారని తెలిపారు. అదానీ, అంబానీకి దేశాన్ని అప్పగించే కుట్ర అమలుకాకుండా కాంగ్రెస్ అడ్డుకుందని స్పష్టం చేశారు. ఓటు ప్రక్షాళన పేరుతో ‘సర్’ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చి పేదలు, మైనార్టీల ఓటు హక్కును తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఓటు పోతే రేషన్ కార్డు, ఆధార్, సంక్షేమ పథకాలన్నీ దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలో ఉండాలా? లేదా? అన్న నిర్ణయం బీజేపీ చేతిలో ఉండేలా కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు.

ఉపాధి హామీపై కుట్ర
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వల్ల పేదల ఆత్మగౌరవం పెరిగిందని సీఎం తెలిపారు. ఈ పథకం ప్రారంభానికి, అమలుకు తెలుగు రాష్ట్రాలే వేదికగా మారాయన్నారు. అయితే ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి, అంబానీ–అదానీ కంపెనీలకు తక్కువ వేతనాల కూలీలను సరఫరా చేయడానికే మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇది పూర్తిగా కార్పొరేట్ కంపెనీలతో కలిసి చేసిన పన్నాగమని విమర్శించారు. గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకువచ్చిన మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాడారని, చివరకు రైతులకు మోదీ క్షమాపణ చెప్పి చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన వికసిత్ భారత్ నినాదం పేరులోనే గందరగోళం ఉందని, దేశంలో వికాసం ఎక్కడ ఉందని ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా పోరాటానికి పిలుపు
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం కొనసాగిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో దేశానికి మోదీ క్షమాపణ చెప్పే వరకూ వదిలిపెట్టమని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకంలో మార్పులకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ఈ నెల 20 నుంచి 30 వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి, కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో, మంత్రులు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ప్రతి మండలానికి ఒక ఇంచార్జీ నియమిస్తామని, తాను కూడా ఒక మండల బాధ్యత తీసుకుంటానని చెప్పారు.
ములుగు సభకు సోనియా, రాహుల్, ప్రియాంక
ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని, ములుగులో జరిగే సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానిస్తామని వెల్లడించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజే రాష్ట్ర ఎంపీలు నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ 66 శాతం సీట్లు గెలుచుకుందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు కార్యకర్తలను గెలిపించే బాధ్యత తమపై ఉందని సీఎం స్పష్టం చేశారు. గల్లీ గల్లీ కాదు… ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే తాను ముఖ్యమంత్రి అయ్యానని, కాంగ్రెస్‌కు తెలంగాణ ఎప్పుడూ అండగా నిలబడిందని తెలిపారు. దేశం ఇబ్బందుల్లో ఉన్న ఈ సమయంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, అందుకు తెలంగాణ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తేల్చిచెప్పారు. మోదీని ఓడించి రాహుల్‌ను ప్రధాని చేయడానికి అందరూ కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


