పాఠశాలకు భూమికి హద్దులు ఏర్పాటు చేయాలి
ఎఫ్‌ఆర్‌ఓకు సర్పంచ్ వినతి
కాకతీయ, ఇనుగుర్తి : లాలూ తండాలోని ప్రభుత్వ పాఠశాలకు చుట్టూ బౌండరీ ఏర్పాటు చేయాలని ఆ గ్రామ సర్పంచ్ భూక్య లక్ష్మీ వెంకన్న నాయక్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మిని కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, 1993లో లాలూ తండాలో స్కూలు నిర్మాణం కోసం ఫారెస్ట్ పరిధిలోని రెండు ఎకరాల భూమిని కేటాయించారని గుర్తు చేశారు. ఆ భూమిలో పాఠశాల భవనం నిర్మించినప్పటికీ, ఇప్పటివరకు బౌండరీ ఏర్పాటు చేయలేదని తెలిపారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు స్కూల్ చుట్టూ కొలతలు వేసి బౌండరీ నిర్మిస్తే, మిగిలిన భూమిలో గ్రామపంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ సెంటర్ నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుందని ఎఫ్‌ఆర్‌ఓకు వివరించినట్లు చెప్పారు. ఈ వినతికి స్పందించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి, త్వరలోనే స్కూల్ బౌండరీ ఏర్పాటు చేస్తామని సానుకూల హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. అనంతరం గ్రామ పాలకమండలి తరఫున ఎఫ్‌ఆర్‌ఓను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూక్య వెంకన్న నాయక్, జీవన్, నూతన గ్రామ పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


