ఏసీబీకి చిక్కిన కేయూ ఎస్‌ఐ శ్రీకాంత్
రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
పేకాట కేసు నిందితుడి నుంచి లంచం డిమాండ్
వల పన్ని పట్టుకున్న ఏసీబీ.. ఉలిక్కిపడ్డ పోలీస్ శాఖ
కాకతీయ, హనుమకొండ : హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ శ్రీకాంత్ ఏసీబీ అధికారుల వలకు చిక్కాడు. పేకాట కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో హన్మకొండ ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పేకాట కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని వేధిస్తూ కేసును తేలిక చేయాలంటే డబ్బులు ఇవ్వాలని ఎస్‌ఐ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం ట్రాప్ నిర్వహించారు.

గురువారం ఎస్‌ఐ శ్రీకాంత్ రూ.15 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఆయనను పట్టుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను నమోదు చేసిన ఏసీబీ అధికారులు, కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో పోలీసు శాఖలో కలకలం రేగింది. అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.


