నీళ్ల పేరుతో రాజకీయ నాటకాలు
అసెంబ్లీ సాక్షిగా సీఎం అబద్ధాలు
కాంగ్రెస్–బీఆర్ఎస్ కలిసి ప్రజలను మోసం
తెలంగాణ నీళ్ల ద్రోహానికి రెండు పార్టీలు బాధ్యత వహించాలి
కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : నీళ్ల సమస్యను ప్రజల జీవన సమస్యగా కాకుండా రాజకీయ లాభాల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బహిరంగ నాటకాలు ఆడుతున్నాయని కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం కరీంనగర్‌లోని శుభం గార్డెన్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ 6 గ్యారంటీలపై చర్చ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై విచారణ తప్పించుకునేందుకే ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో వాస్తవాలను వక్రీకరించారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన పాపాలే నేడు తెలంగాణ ప్రజలకు శాపాలుగా మారాయని వ్యాఖ్యానించారు.
నీళ్ల ద్రోహానికి తొలి ముద్దాయి కాంగ్రెస్
తెలంగాణకు నీళ్ల అన్యాయం చేసిన మొదటి దోషి కాంగ్రెస్ేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలో కృష్ణా నదిలో 811 టీఎంసీల వాటా ఉన్నా తెలంగాణకు 200 టీఎంసీలకు మించి వినియోగించుకోకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. గోదావరిలో 1486 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా తెలంగాణలో 500 టీఎంసీలకు మించి వాడుకోనీయలేదన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89లో తెలంగాణకు కీలకమైన పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను చేర్చకపోవడంపై ఆనాటి కాంగ్రెస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పోతిరెడ్డిపాడు ద్వారా రోజూ నీళ్లు తరలిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకు అడ్డుకోలేకపోయాయని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పాలనలో మరణ శాసనం
నీళ్ల విషయంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు మరణ శాసనం అమలైందని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం అయిన కొత్తలో “తెలంగాణకు కేసీఆర్ అనే అణుబాంబు ఉంది” అంటూ డాంబికాలు పలికిన కేసీఆర్ చివరకు ఏపీ ప్రభుత్వానికి అమ్ముడుపోయారని విమర్శించారు.
తెలంగాణకు రావాల్సిన 575 టీఎంసీలకు బదులు కేవలం 299 టీఎంసీలకే ఒప్పుకుని సంతకం చేసి దక్షిణ తెలంగాణను మోసం చేశారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎవరిని అడిగి 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని, అది కేసీఆర్ జాగీరా అని ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్ సాక్షిగా జరిగిన ఈ ద్రోహాన్ని తానే మొదట బయటపెట్టానన్నారు.
ప్రగతి భవన్ డీల్సే సాక్ష్యం
ప్రగతి భవన్లో అప్పటి ఏపీ సీఎం జగన్‌తో సమావేశాలు పెట్టుకుని “బేసిన్లు లేవ్.. బేషజాల్లేవ్” అంటూ డీల్స్ మాట్లాడలేదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. రోజా ఇంట్లో విందులు, రొయ్యల పులుసుల వెనుక ఉన్న మర్మాన్ని కల్వకుంట్ల కవిత బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అక్రమ నిర్మాణంపై అప్పట్లో వచ్చిన వార్తలను కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు.
తెలంగాణ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతోనే కేసీఆర్ 575 టీఎంసీల మాట మాట్లాడారని, కేఆర్ఎంబీకి లేఖ రాసి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును ఆపింది కేంద్రమేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అసెంబ్లీ సాక్షిగా బూతులు తిట్టుకుంటూ అబద్ధాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ 6 గ్యారంటీలపై చర్చ జరపాలని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కలిసి రావాలని రెండు పార్టీలను కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతిపై సీబీఐ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం 11 ఏళ్లలో తెలంగాణకు రూ.12 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చిన విషయాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ కావాలనే దాచిపెడుతున్నాయని ఆరోపించారు.


