న్యాయానికి మానవీయ స్పర్శ
కక్షిదారురాలి వద్దకే వెళ్లి ఎవిడెన్స్ నమోదు
దివ్యాంగురాలి బాధను గమనించిన తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్ కుమార్
కాకతీయ, తొర్రూరు : తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి దామెర ధీరజ్ కుమార్ మరోసారి తన ఔదార్యాన్ని, ప్రజాపక్షపాతాన్ని చాటుకున్నారు. ఒక సివిల్ కేసు విచారణ సందర్భంగా న్యాయానికి మానవీయ స్పర్శను జోడిస్తూ తీసుకున్న ఆయన నిర్ణయం ప్రజల హృదయాలను గెలుచుకుంది. విచారణకు హాజరైన పద్మ అనే కక్షిదారురాలు కాళ్లు పనిచేయక కోర్టు భవనం మొదటి అంతస్తుకు ఎక్కలేని పరిస్థితిలో ఉండటాన్ని జడ్జి గమనించారు. ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందిని తెలుసుకున్న వెంటనే, విధివిధానాలకే పరిమితం కాకుండా ఆమె వద్దకే నేరుగా వెళ్లి అక్కడే ఎవిడెన్స్‌ను రికార్డ్ చేశారు.
న్యాయానికి నిజమైన అర్థం
దివ్యాంగులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న కక్షిదారులు న్యాయానికి చేరుకోవడంలో ఎదుర్కొనే అడ్డంకులను తొలగించడమే నిజమైన న్యాయసేవ అని ఈ సంఘటన స్పష్టంగా నిరూపిస్తోంది. న్యాయస్థానాల గౌరవాన్ని కాపాడుతూ, ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పెంచేలా జడ్జి తీసుకున్న ఈ చొరవ అభినందనీయమని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. న్యాయమూర్తుల్లో ఉండాల్సిన సంయమనం, కరుణ, ప్రజాసేవాభిమానం ఒకే సంఘటనలో ప్రతిబింబించడం గర్వకారణమని స్థానికులు ప్రశంసిస్తున్నారు. తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి చూపిన ఈ ఔదార్యం న్యాయవ్యవస్థకు ఆదర్శంగా నిలిచి, ఇతర న్యాయస్థానాలకు కూడా ప్రేరణగా మారాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.


