నైపుణ్యాలే కెరీర్‌కు పునాది
కాకతీయ ప్రభుత్వ కళాశాలలో ఉపాధి శిక్షణ ముగింపు
ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ పరిధిలోని కాకతీయ ప్రభుత్వ కళాశాల (ఆటోనమస్), హనుమకొండలో ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం నిర్వహించిన వారాంత ఉపాధి నైపుణ్యాల శిక్షణ కార్యక్రమం గురువారం విజయవంతంగా ముగిసింది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రజని లత మాట్లాడుతూ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నిరంతర నైపుణ్యాభివృద్ధి కెరీర్ విజయంలో కీలకమని తెలిపారు. విద్యార్థులు శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను కేవలం సిద్ధాంతంగా కాకుండా ఆచరణలో పెట్టాలని ఆమె సూచించారు.
ఉద్యోగావకాశాలపై అవగాహన
టీఎస్‌కేసీ కోఆర్డినేటర్ మరియు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎ. అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఉద్యోగ సాధనలో ఇంటర్వ్యూ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, సమర్థవంతమైన రెజ్యూమే కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్లోబల్ సర్టిఫికేషన్లు, ఇంటర్న్‌షిప్‌లు విద్యార్థుల ఉపాధి అవకాశాలను మరింత విస్తరించడంలో దోహదపడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రాజశేఖర్, అధ్యాపకులు శ్రీనాథ్, నరహరి, సమ్మయ్య, శ్రీకాంత్, శ్రావణ కుమారి, మ్యాజిక్ బస్ ఫౌండేషన్ ప్రతినిధులు రాకేష్, నందీశ్వర్, ట్రైనర్ అరుణ్ పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం విద్యార్థుల్లో ఉద్యోగోపయోగ నైపుణ్యాలను పెంపొందించడంలో ఉపయుక్తంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.


