అక్రమ ఇసుక రవాణాపై దాడులు
8 ట్రాక్టర్ల పట్టివేత
కాకతీయ, జమ్మికుంట : గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే దిశగా పోలీసు శాఖ కఠిన చర్యలు చేపట్టింది. గురువారం హుజురాబాద్ ఏసీపీ మాదవి ఆధ్వర్యంలో జమ్మికుంట రూరల్, హుజురాబాద్ రూరల్ ఇన్‌స్పెక్టర్లు, సైదాపూర్, ఎల్లంతకుంట ఎస్‌ఐలు, టీజీఎస్పీ దళం, సివిల్ పోలీసు బలగాలతో కలిసి గండ్రపల్లి, తనుగుల, వావిలాల, విలాసాగర్ గ్రామాల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన విస్తృత తనిఖీల్లో అక్రమ ఇసుక రవాణా వెలుగులోకి వచ్చింది. ఇసుకతో నిండిన మూడు ట్రాక్టర్లు, అలాగే రవాణాకు సిద్ధంగా ఉన్న ఐదు ఖాళీ ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఇసుక దందాపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అక్రమ రవాణా, చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.


