కాకతీయ, నేషనల్ డెస్క్: భారత్ పై అమెరికా భారీగా సుంకాలు మోపిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామన్న కారణంతోనే ఈ సుంకాలను విధించిన విషయం తెలిసిందు. దీనిపై తాజాగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు న్యూ ఢిల్లీపై ట్రంప్ సుంకాలు విధించినట్లు తెలిపారు.
మంగళవారం వీడియాతో మాట్లాడుతూ..ఈ కామెంట్స్ చేశారు. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని ట్రంప్ డిసైడ్ అయినట్లు లీవిట్ తెలిపారు. రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలను లక్ష్యంగా చేసుకుని దానిపై ఒత్తిడి తీసుకురావాలనుకున్నట్లు తెలిపారు. అది ట్రంప్ పరిపాలన వ్యూహమని వ్యాఖ్యలు చేశారు. దీనిలో భాగంగానే భారత్ పై 50శాతం సుంకాలను విధించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
నాటూ సెక్రటరీ జనరల్ తో సహా యూరోపియన్ నాయకులతో జరిగిన చర్చలే యుద్ధం ముగింపునకు తొలి అడుగు అని అభివర్ణించారు. ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే అసలు రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ప్రారంభమయ్యేది కాదని ఉద్ఘాటించారు. పుతిన్ కూడా ఇదే పేర్కొనడాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ సందర్భంగా భారత్ పాక్ ల మధ్య యుద్ధాన్ని ట్రంప్ వాణిజ్యంతో ముగించారని లీవిట్ మరోసారి తెలిపారు. న్యూ ఢిల్లీ ఈ వాదనలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. కాల్పుల విరమణతో మూడో దేశం జోక్యం చేసుకోలేదని పలుమార్లు స్పష్టం చేసింది. అయినా కూడా అమెరికా అధికారులు ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించడం గమనార్హం.


