గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
కాకతీయ, వరంగల్ సిటీ : తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల (కో-ఎడ్యుకేషన్), మడికొండ–కాజీపేట, హనుమకొండ జిల్లా ప్రిన్సిపాల్ బత్తుల కుమారస్వామి తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ… డిసెంబర్ 11, 2025 నుంచి జనవరి 21, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు రూ.100 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 22, 2026 (ఆదివారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్ష ద్వారా గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారని స్పష్టం చేశారు.
అవసరమైన ధ్రువపత్రాలు
దరఖాస్తు సమయంలో కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, ఫోటో, మొబైల్ నంబర్ తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ విద్యావకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ బత్తుల కుమారస్వామి కోరారు.


