జాగృతిలో అధ్యయన కమిటీ ఏర్పాటు!
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి
కమిటీ సభ్యుడిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్
సారథిగా బాధ్యతలు అప్పగించిన కవిత
భవిష్యత్ మ్యానిఫెస్టోకు పునాది
కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ జాగృతి నూతన ప్రాంతీయ రాజకీయ పార్టీగా రూపుదిద్దుకునే దిశగా కీలక అడుగులు వేస్తోంది. పార్టీ ఏర్పాటు నేపథ్యంలో ప్రజల సమస్యలను లోతుగా అధ్యయనం చేసేందుకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సుమారు 30 అంశాలతో కూడిన అధ్యయన కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీలో తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను సభ్యుడిగా, సారథిగా ఎంపిక చేశారు. తెలంగాణలో ఉన్న లక్షలాది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేయడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా ఉండనుంది. డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ నేతృత్వంలో కమిటీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, బత్యాలు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య సమస్యలు, ఇన్సూరెన్స్ వంటి అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేయనుంది. ఈ అంశాలన్నింటినీ భవిష్యత్ తెలంగాణ జాగృతి పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచే విధంగా నివేదిక సిద్ధం చేయనున్నారు. డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ మొదటి నుంచే తెలంగాణ జాగృతికి, కవితకు బలమైన మద్దతుగా నిలిచిన బహుజన నాయకుడిగా, విద్యావంతుడిగా గుర్తింపు పొందారు. కవితకు అత్యంత అనునయుడైన ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
కమిటీలో ఇతర సభ్యులు
ఈ కమిటీలో అనుబంధంగా పనిచేయడానికి ఐదా ప్రశాంత్, వీరన్న (కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు), ఐలి కవితలను కూడా సభ్యులుగా ప్రకటించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల సాధన ధ్యేయంగా ఈ కమిటీ పని చేయనుందని, వారి పోరాటమే తెలంగాణ జాగృతి భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో నూతన ప్రాంతీయ పార్టీగా తెలంగాణ జాగృతి ఏర్పాటవ్వడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్న తరుణంలో… ఈ అధ్యయన కమిటీల ఏర్పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.


