ఆహార కల్తీపై ఉక్కుపాదం!
ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు
కల్తీని హత్యాయత్నంగా పరిగణిస్తాం
ప్రత్యేక బృందాలు, ఎస్వోపీ అమలు
సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరిక
కాకతీయ, హైదరాబాద్ : నగరంలో ఆహార కల్తీని ఇక ఏమాత్రం ఉపేక్షించబోమని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. కల్తీ రక్కసిని కూకటివేళ్లతో పెకిలించేందుకు పోలీసు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపనున్నట్లు ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో బుధవారం ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులతో జరిగిన సన్నాహక సమావేశంలో సీపీ మాట్లాడారు. ఆహార కల్తీని చిన్నపాటి నేరంగా చూడబోమని, ఇది ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే హత్యాయత్నంతో సమానమని స్పష్టం చేశారు. రోడ్డు పక్కన చిరు వ్యాపారులకే పరిమితం కాకుండా, కల్తీకి మూలమైన తయారీ కేంద్రాలపై కూడా నేరుగా దాడులు చేస్తామని వెల్లడించారు.
ప్రత్యేక ఎస్వోపీ అమలు
ఆహార కల్తీ నియంత్రణలో ఎదురవుతున్న సవాళ్లపై పోలీసు, ఆహార భద్రతా అధికారులతో సీపీ సమీక్షించారు. తనిఖీలు, నమూనాల సేకరణ, సీజ్, అరెస్టుల ప్రక్రియలో న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. అధికారుల సూచనలను పరిగణనలోకి తీసుకుని కల్తీ నివారణకు పటిష్ట చర్యలు చేపడతామని పేర్కొన్నారు. వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సీపీ హెచ్చరించారు. కల్తీ కేసుల్లో పదే పదే పట్టుబడితే వారి వ్యాపార లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయిస్తామని స్పష్టం చేశారు. ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే కల్తీ మాఫియాపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని తేల్చిచెప్పారు. కల్తీ జరుగుతోందన్న అనుమానం వచ్చిన వెంటనే ప్రజలు సమాచారం అందించేందుకు ప్రత్యేక వాట్సాప్ లేదా టోల్‌ఫ్రీ నంబర్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు, జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డెవిస్, డీసీపీలు శ్వేత, అపూర్వ రావు, రూపేష్, గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల, డీఎఫ్సీ (రిటైర్డ్) విజయ్ కుమార్, ఏఎఫ్‌సీలు బాల్ రాజు, ఆనంద రావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ జగ్గా రెడ్డి, అన్ని జోన్ల డీసీపీలు, అదనపు డీసీపీలు తదితరులు పాల్గొన్నారు.


