ఏసీబీ వలలో అవినీతి చేపలు
వేర్వేరు ఘటనల్లో నలుగురు అరెస్ట్
పట్టుబడిన వారిలో ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్..
ముగ్గురు పీఆర్ ఉద్యోగులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నలుగురు లంచగొండి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. బుధవారం వేర్వేరు ఘటనల్లో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వీరిలో ఓ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ తోపాటు ముగ్గురు పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బాగ్ అంబర్‌పేట ప్రాంతంలోని దేవాదాయశాఖ భూమికి సంబంధించి సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి 1.50 లక్షల డిమాండ్ చేయగా.. అందులో మొదటి విడతగా 50,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ కుమార్ నుంచి నగదును స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.
రంగారెడ్డి జిల్లాలో
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో ఓ భవన నిర్మాణ అనుమతుల కోసం లక్ష డిమాండ్ చేసిన అధికారులను ఏసీబీ వలపన్ని పట్టుకుంది. పట్టుబడిన వారిలో ఎంపీడీవో సుమతి, ఎంపీవో తేజ్ నాయక్, ఈదులపల్లి పంచాయతీ కార్యదర్శి చెన్నయ్య ఉన్నారు. భవన నిర్మాణానికి సహకరించేందుకు లక్ష తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు వెల్లడించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.


