బెదిరింపుల ముఠా గుట్టు రట్టు!
జనశక్తి పేరుతో వసూళ్ల దందా
9 ఎంఎం పిస్టల్‌తో నలుగురు అరెస్ట్
భూ వివాదాల్లో జోక్యం, డబ్బుల డిమాండ్
పోలీసుల అప్రమత్తతతో బట్టబయలు
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : జనశక్తి కార్యకలాపాల పేరుతో ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేయాలని యత్నించిన ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ఒక 9 ఎంఎం పిస్టల్‌తో పాటు ఐదు రౌండ్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తోకల శ్రీకాంత్, దాసరి తిరుపతి, పయ్యావుల గోవర్ధన్‌తో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన వంజరి సురేందర్ ముఠాగా ఏర్పడి జనశక్తి పేరుతో ప్రజలను బెదిరించడం, భూ వివాదాల్లో జోక్యం చేసుకోవడం, డబ్బులు వసూలు చేయడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న నమ్మదగిన సమాచారం పోలీసులకు అందింది. ఈ సమాచారం మేరకు తంగళ్లపల్లి గ్రామ శివారులో వాహనాల తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా కనిపించిన నలుగురిని అడ్డుకుని తనిఖీ చేశారు. తనిఖీల్లో వారి వద్ద ఒక 9 ఎంఎం పిస్టల్‌తో పాటు ఐదు రౌండ్లు లభించడంతో ఆయుధాలను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేశారు.
గతంలోనూ సంబంధాలు
అరెస్ట్ అయిన వారిలో తోకల శ్రీకాంత్ (34), దాసరి తిరుపతి (43), వంజరి సురేందర్ అలియాస్ విశ్వనాథ్ అలియాస్ బాదం సూర్య ప్రకాష్ రెడ్డి (57), పయ్యావుల గోవర్ధన్ (31) ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో కొందరికి గతంలో నిషేధిత జనశక్తి సంస్థతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలను బెదిరించడం, అక్రమ కార్యకలాపాలకు పాల్పడటం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు. ఈ ఆపరేషన్‌లో సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, టాస్క్‌ఫోర్స్ సీఐ నటేష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రవి, ఎస్సై ఉపేంద్రచారి తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు


